ఆదికాండము 19:26 :- ఉప్పు స్తంభము (Pillar of Salt)
బైబిలు పఠనము: కీర్తనలు 144:12
మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు
క్రీస్తు నందు ప్రియమైన యూవన సహోదర సహోదరీ లారా, మన చుట్టూ భయానకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తన రెక్కల నీడలో మనలను ఉంచి కాపాడుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు, శుభములు.
యూవనస్థులు ఇహలోకములో మరియు పరలోకములో గల దేవుని ఇంటిలో ఎదిగిన మొక్కల వలె, మూల స్తంభములవలె ఉండుట అనునది ఎంతో అద్భుతమైన విషయమని, దానికొరకు అవసరమైన బలాన్ని దేవుని ద్వారా మరియు ఆయనలో ఆనందించుట ద్వారా ఎలా పొందగలమో అని మన మొదటి ధ్యానాన్ని గతవారం ఆరంభించుకొన్నాము.
దేవుని ఇంటి యొక్క స్తంభములుగ ఉన్న యూవనస్థులు బలముగా ఉన్నప్పుడే దాని యొక్క పైకప్పు భద్రంగా ఉంటుంది. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంధము లో వ్రాయబడిన మొదటి స్తంభము ఒక బలహీనమైన స్తంభముగ ఉండుట మనము బహు జాగ్రత్తగా గమనించ వలసి యున్నాము.
ఆదికాండము 19:26 :- ఉప్పు స్తంభము (Pillar of Salt)
లోతు తన జీవితములో దేవుని మహా కృపను పొంది, విగ్రహారాధికులు ఐన తన పూర్వీకులనుండి తన చిన్నాన్న ఐన అబ్రాహాముతో కలసి తన దేశమును వదలి బయటకు వచ్చాడు. దేవుని కృప అనే మాట ఆదికాండములో 2 సార్లు మాత్రమే వ్రాయబడి ఉండుట మనము గమనించగలము. ఆది.కా. 6:8 లో నోవహు విషయములో మరియు ఆది కా 19:19 లో లోతు విషయమంలో మాత్రమే మనము చూడగలము.
నోవహు తాను పొందిన కృపను సద్వినియోగము చేసికొని, తనకు ముందుగా చెప్పబడిన ప్రళయమును గురించి విని, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై నీతికి వారసుడైనాడు (హెబ్రీ 11:7). అయితే చివరి క్షణము వరకు ఈ కృపను పొందిన ఈ స్త్రీ దేవదూతల చేత హెచ్చరించబడినప్పటికిని, దేవుని కృపను నిరర్థకము చేసికొని నిష్ఫలమైన, బలహీనమైన ఉప్పు స్తంభముగ జీవితమును పాడుచేసికొన్నది. దానికి గల కొన్ని కారణాలను ఈదినము మనము చూ సికొందాము.
1) (విశ్వాసమును బట్టి కాక) వెలిచూపుని బట్టి నడచుకొనుట (Looking by sight but not by faith):
2) ఈ లోకము యెడల ప్రేమ (Love towards the World)
3) సోమరితనం (Laziness)
4) వెనుకవైపు తిరిగి చూచుట (Looking behind)
1) వెలిచూపుని బట్టి నడచుకొనుట: రక్షించబడి, పాపమునుండి విడిపించబడి ఆయన రక్తము వలన కడుగబడి జీవముగల దేవుని వెంబడించే మనము, మనలను పిలిచిన అయన యందు విశ్వాసముతో మన యాత్ర జీవితమును కొనసాగించవలసి ఉన్నాము. II కొరింథీ 5:6 వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొను చున్నాము. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనపందెపు రంగములో మనము పరుగెత్త వలెను.
ఆది కా 13:10-12 లోతు తన కన్నులెత్తి … చూచెను…తనకు యొర్దాను ప్రాంతముని ఏర్పాటు చేసికొని సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను. లోతు మరియు లోతు భార్య వెలిచూపుని బట్టి చూసికొని సొదొమ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొన్నారు. ప్రియమైన యవ్వనస్థులారా ఈ లోకము, లోకపు ఆకర్షణలు చూచుటకు అందంగా, వివేకమిచ్చు రమ్యమైనవిగ మనకు కనబడి మనలను మోసము చేయును. జాగ్రత్త! మనము గమనించిన, అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై యుండెను. యెహోవా తోట కాదు అయితే యెహోవాతోట వలే అను మాట ఎంత మోసపూరితమైనదిగా ఉన్నదో చూడుడి. అది బయటకు యెహోవా తోట వలే ఉన్నది అయితే అది లోపల నిజంగా సాతాను తోట. బాహ్యంగా కనపడేదానిని వెలి చూపును బట్టి ఎన్నిక చేసుకొన్నారు. అందువల్ల బలహీనమైన నిష్ఫలమైన స్తంభముగా ఉండిపోయారు
నీ కను దృష్టితో నీవు చూచి ఏర్పరచు కొనేది ఈలాగు ఉన్నయెడల నష్టపోయెదవేమో ఆలోచించుకొనుము. నీవు దేనినైనా చూసి నప్పుడు అది దేవుని లేఖనానుసారమైనది కాకుండా నిన్ను ఆకర్షించుచున్నట్లైతే అది నిన్ను నిష్ఫలముగా చేయును. ఒక వేళ అది దేవుని తోట వలే అగుపించ వచ్చును. అది నిన్ను తన వైపునకు ఆకర్షించుకోనవచ్చు. సామెతలు 14:12 ఒకని ఎదుట సరిఅయినదిగ కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దాని చక్కదనము నందు నీ హృదయములో ఆశపడకుము… అది నిన్ను లోపరచుకొననియ్యకుము సామెతలు 6:25.
అది ఐగుప్తు దేశమువలె వున్నది, అనగా ఆదేశపు నాగరికత, విజ్ఞానము, అప్పటిలో ప్రసిద్ధిచెందిన ఆదేశపు వైద్య విధానము, ఆదేశపు టెక్నాలజీ, అత్యాధునికత నిన్ను ఒక వేళ ఆకర్షించవచ్చును. చాలామంది దేవుడు వారికి చూపించక ముందే, దేవునిచేత నడిపించబడక పైపై మెరుగులను చూసి తీర్మానములను చేసికొని దానిని సమర్థించుకొని తమ యవనబలమును, ఆత్మీయ జీవితమును నష్టపరచు కొనుచున్నారు.
హవ్వ, దీనా, సమ్సోను మొదలగువారు ఇలాంటి బలహీన స్తంభములుగా మనము చూడగలము. వారు దేవుడు వారికొరకు ఉంచిన ఉన్నతమైన ప్రణాలికను మరచి పైపైన కనబడే వాటిచేత ఆకర్షించబడి బలహీన మైన స్తంభములుగా తమ జీవితములను ముగించిరి. ఎంతో మంది యవ్వనస్థులు తమ కన్నులు దేనిచేత ఆకర్షించబడునో వాటి వెంబడి వెళ్లి నిశ్ఫలులుగా, బలహీనులుగా ఉండుట వలన మన ప్రభువు ఎంతో దుఃఖించు వాడుగా వున్నాడు.
ప్రియమైన యవ్వన బిడ్డా నీ కోరకు ప్రభువు ఏర్పరచిన దాన్ని నీవుచూడగలుగు చున్నావా? దేవుడు ఆయన బిడ్డవయిన నీకు శ్రేష్టమైనది ఇచ్చును. కీర్తన 85:12 యెహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును. ప్రభువు మనకిచ్చు వరకు మనకన్నులు ఆయన వైపు ఎత్తుకొని ఉండవలెను. దాసీ మరియు దాసుని కన్నులు యజమానుని వైపు ఉండునట్లుగా . దేవుడు మనలను కరుణించు వరకు మన కన్ను లు ఆయన వైపు ఉండవలెను.
అదే అధ్యాయములో ఆది.కా 13:14 దేవుడు అబ్రాహామును కన్నులెత్తి చూడమని చెప్పువరకు అబ్రాహాము దేనిని తనకొరకు ఏర్పరచు కొనలేదని మనము గమనించవచ్చు. అందువలన మిగిలిన వచనములలో 3 ఆశీర్వాదములను పొందిన అబ్రహాము సదాకాలము కొరికైన దేవుని స్తంభముగా ఉండుట మనకు తెలియును. ఆయన నీకొరకు సిద్ధపరచిన అద్భుతమైన అందమైన అనిర్వచనీయమైన అనంతమైన వాటిని పొందుటకొరకై విశ్వాసముతో ఆయనవైపు నీ దృష్టిని మరల్చుకో.
కీర్తన 104:21 సింహపు పిల్లలు దేవునిచేతిలోనుండి తమ ఆహారమును తీసికొన జూచు చున్నవి. 104:27 మకరములు దేవుని దయ కొరకు కానీ పెట్టుకొను చున్నవి. వీటి ద్వారా మనము దేవుని చేతివైపు చూడవలెనని మరియూ దేవుని దయకొరకు కనీ పెట్టుకొనవలెనని పాఠము నేర్చుకొనుచున్నాము.
ఇస్సాకు తన జీవితములో తొందరపడక, ధ్యానించేవాడుగా ఉండుట చేత దేవునిచిత్తమును నెరవేర్చిన వాడుగా ఇశ్రాయేలు వంశమునకు ఒక స్తంభము వలె ఉన్నాడు. అప్పటికప్పుడే వెంట వెంటనే అన్ని జరిగిపోవాలి అని కోరుకొనే తరములో ఉన్న మనము ప్రత్యేకమైనవారుగా దేవునికొరకు కనిపెట్టుకొనుట చాలా అవసరము. కీర్తన 33:19 అయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయిన మరణము నుండి నే ప్రాణమును అయన తప్పించును. కరువులో సజీవుడుగా కాపాడును. 37:34 అయన నిన్ను హెచ్చించును. భయపడవద్దు నీ స్నేహితులు ఏర్పరచు కొన్నవి నీవు చూచి నప్పుడు నీకు అవకాశములు ఇక ఉండవని ఇక మిగలవని తొందర పడవద్దు. కీర్తన 59:9,10 కనిపెట్టుకొన్న నీ వద్దకు అయన వచ్చి తన కృపతో నిన్ను తప్పక కలిసికొనే దేవుణ్ణి నీవు కలిగి యున్నావు.
యవ్వన సహోదరా! సహోదరీ!! నీ భవిష్యత్తు ఎరిగిన దేవుని నీవు కలిగి యున్నావు. ఆయన నీకొరకు తన కుమారున్నే బలిగా అప్పగించిన ప్రేమగల దేవుడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహోపడు? తప్పక అనుగ్రహించును. గనుక అబ్రాహాము వలె విశ్వాసముతో దేవుడు చెప్పేవరకు వేచి ఉండు, తొందరపడి మోసపోవద్దు, నీ ప్రతి ఎన్నిక కొరకు, తీర్మానం కొరకు నీ రక్షకునివైపు చూడు.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడచిపోవుదురు. యెషయా 40:31 అయన నిన్నుతన నూతన బలముతో నింపి పైకి ఎదుగునట్లుగా, ఎగురునట్లుగా చేసి బలపరచి తన ఏర్పాటులో తన చిత్తములో నుంచి తనఇంటి కొరకైన బలమైన స్తంభముగా నిన్ను చేసి తన మహిమకొరకై నిన్ను సిద్ధపరచును గాక. నీ చిన్ని చిన్ని విశ్వాసపు అడుగులను దేవుడు బలమైనవిగా చేయును గాక!