దేవుని ప్రేమించుట – లోకమును ప్రేమించుట (Loving God – Loving the world)

దేవునికి ప్రియమైన వారైన యవ్వన సహోదర సహోదరీలకు మనతండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు కలుగును గాక! మీరందరు దేవుని అపారమైన కృపద్వారా కాపాడబడుచు  అయన సురక్షితమైన రెక్కల క్రింద క్షేమముమగా ఉన్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాము.

మీరందరు మీ యవ్వన  కాలమందు ఎదిగిన మొక్కలవలె,చెక్కిన మూల కంభముల వలె ఉండవలెను అన్న మన దేవుని  యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యమును మనము దేవునివాక్యము నుండి ధ్యానించడము ఆరంభించితిమి.  బైబిలు గ్రంథములోని మొదటి స్తంభము, ఉప్పు స్తంభము నుండి, మనము బలహీన స్తంభముగా ఉండకుండుటకు మొదటి విషయముగా వెలిచూపువలనకాక విశ్వాసము వలననే  నడచు కొనవలెనని తీర్మానం నేర్చు కొంటిమి. మిగిలినవాటిని ఈదినము ధ్యానించుటకు ప్రభువు సహాయము చేయును  గాక!

2) ఈ లోకము యెడల ప్రేమ  (Love towards the World) 

ఆది. కా. 19:16 అతడు (లోతు) తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆమనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. బయటికి వచ్చిన లోతు భార్య మరల (లోకమును) సొదొమను  ప్రేమించుట మనము చూడగలము. దాని మీది ఉన్న ప్రేమను బట్టి ఆమె అతని వెనుక నున్నట్టుగా మనము 19:26 లో చూడగలము. ఆమె తాను కోల్పోయిన లోకసంబంధమైన జీవితమును గురించి ఆలోచించింది తన రక్షణ విషయమై నిర్లక్ష్యాన్ని చూపింది.

లోకమును ప్రేమించుట అనగా లోకములో ఉన్నవాటిని

లోకపు స్థలమును (శరీరాశ),

లోకపు ఆస్తులను (నేత్రాశ)

లోకపు  స్థానమును, (జీవపుడంబము)

ప్రేమించుట అని చూడవచ్చు.

భయకరమైన ప్రస్తుతపు లోకపు పోకడలు కలిగిన స్థలము, సొదొమను ప్రేమించి లోతు కుటుంబము దాని వద్దకు వెళ్లారు. అది పచ్చగా ఉంది అని దానిని ప్రేమించారు. ఆది. కా 13:12 సొదొమ లోనికి వెళ్లారు. యాకోబు 4:4 ప్రకారము వారు  వ్యభిచారులయ్యారు, దేవునికి శత్రువులు అయ్యారు. ఆ స్థలములో దుర్మార్గులు ఉన్నారు. వారు కామ వికార యుక్తమైన నడవడి గలవారు IIపేతురు 2:4. వారు పరశరీరరానుసారులు యూదా 1:7 అనగా ఎల్లప్పుడూ వారు ఇతరుల శరీరములను గూర్చి విచారించు వారు, వాటిని గురించి వర్ణించుట, ఇష్టము కలిగియుండుట మరియు ఇతరులతో శరీర సంభంధమును ఏర్పరచుకొనుట వారికీ సర్వసాధారణమైన విషయముగా కనబడుచున్నది. లోతుభార్య లోకమును ఎంతగాప్రేమించినదంటే, దేవుడు అసహ్యించుకొనిన గొప్ప దుష్టత్వమును కలిగియున్న సోదమలో నివసిస్తూ దాని ఆనందాలను ఆస్వాదించాలని  తాను వెనుదిరిగి చూసింది.

ప్రియమైన యవ్వనస్థుడా లోకములో ఇప్పుడు ఉన్న ఈ తీవ్రమైన చెడునడవడిక ఉన్న స్థలాలలో నీవు ఉంటున్నావా.? వాటిగురించి మాట్లాడే, చూపించే, స్నేహితులమధ్య నీ మనసుని నొప్పించుకొని, చంపుకొని లోతు వలే ఆ స్థలాలను వదలి  రాకుండా అక్కడే ఉంటున్నావా ? అది నీ శరీరానికి ఆహ్లాదంగా అనిపించుచున్నదా ? జాగ్రత్త! నీ శరీరాశలు నిన్ను ఆత్మీయంగా బలహీనునిగా చేయును. శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సునుంతురు మరియు శరీరానుసారమైన మనస్సు మరణము. హాస్టల్ లో కాలేజీ లో రూమ్స్ లో ఎవరిమద్యలో నీవు ఉంటున్నావో నీవేమి చేస్తావున్నావో, చూస్తూవున్నావో జాగ్రత్త ! క్రూరులకు నీ జీవిత కాలమును ఎందుకు ఇచ్చివేతువు ? సామెతలు 5:10-12 దానివలన నీ శరీర మాంసము క్షీణించినప్పుడు అయ్యో అని ఉపదేశము త్రోసివేసితేనే గ్డదింపు తృణీకరించితేనే అని అనుకొనుట వలన ప్రయోజనము ఉండదు.  అప్పటికి సొదొమ కాలిపోయి ఉండును, నీవు ఉప్పు స్తంభము వలే నిష్ఫలుడవు బలహీనుడవు అవుదువేమో!   ఆమె నిజంగా దేవుణ్ణి ప్రేమించలేదు. ఆమె ఈ ప్రపంచంలోని విషయాలను ఎక్కువగా ఇష్టపడింది. కాబట్టి దేవుడు ఆమెను ఉప్పు స్తంభంగా మార్చి శిక్షించాడు.

ప్రభువు పిలుపు విను సామెతలు 10:20 నాకుమారుడా! నీవేల ఇతరుల శరీరముల యందు బద్ధుడవై ఉందువు ? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి యున్నారు గలతి 5:24. వారిని వారి స్థలములను సాంగత్యమును వదలి రావడము కష్టమే! నీవు సిలువ అనుభవముగుండ వెళ్ళినపుడు కొంత ఎగతాళి హేళన అనుభవించవచ్చు. అయితే

ప్రకటన 18:4 మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తిపకుండు నట్లు దానిని విడచిరండి అనే పరలోక స్వరమును విని బయటకు వచ్చినట్లైన దేవుడు నిన్ను తన బలముతో నింపును.

లోకపు ఆస్తులను సంపాదించుకొనుట ఈ దినాలలో యవ్వనస్థులకు ఒక వ్యసనంగా మారుచున్నది. లోక సంబంధమైన వస్త్రములు, వస్తువులు, విలాసాలు, సంపాదించుటకు చాలామంది యవ్వనస్థులు ఎంతో భయంకరమైన పనులు చేయటం మనము చూస్తూవున్నాము. మేము పనిచేసేచోట జైలు పరిచర్యకు వెళ్ళినప్పుడు అచ్చట చాలామంది బాగా చదువుకున్న యవ్వన ఖైదీలు ఉండుట చూసి ఆశ్చర్యపోయాము.

వారిలో కొంతమంది స్మగ్లింగ్ చేయటవలన, కొంతమంది వ్యభిచారంలో పట్టబడి, మరికొంతమంది డ్రగ్స్ వ్యాపారము చేస్తూ, కొంతమంది ఆన్లైన్ మోసాలు చేస్తూ జైలు శిక్ష పొందుచున్నారు. ఎందుకు ఆలా చేసారు అని ప్రశ్నించి నప్పుడు అందరి సమాధానం ఒక్కటే, ” ఆస్తులు సంపాదించాలి కొద్దిరోజుల్లోనే ధనవంతులు కావాలి”. ఎదుటివాడికంటే నేను ఉన్నతంగా సమాజములో కనబడాలి అని, మంచి అతి విలువైన వస్త్రములు, విలాసవంతమైన కార్లు, అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుట కొరకు నేటి యవ్వనస్థులలో చాలామంది నేత్రాశలో పడి జీవితమును పాడుచేసుకొనుచున్నారు.

దేవుని ఇంటిని వచ్చే అనేకమంది యవ్వనస్థులు షేర్ల గురించి మాటలాడుచు చర్చించుకొనుట ఎంతవిచారం. గేహాజి వలే వాటి వెంబడి పరిగెత్తుతూ, బలమైన స్తంభాలుగా తాము ఉండవలసిన దేవుని ఇంటి నుండి వెళ్లగొట్టబడిన వారుగా, దేవుని శాపమును పొందినవారుగా, పరిచర్యను నిర్లక్ష్యము చేసినవారిగా ఉంటున్నారు. ద్రవ్యమును, వస్త్రములను, ద్రాక్షతోటలను … సంపాదించు కొనుటకు ఇది సమయమా ? II రాజులు 5:26. దానివలన కలిగిన కుష్టు నిన్ను ఎంత బలహీనునిగా చేస్తువుందో దయచేసి గమనించు. తాము మోయవలసిన పరిచర్య భారము, సువార్త భారము, ప్రార్థన భారము, పేదవారైన విశ్వాసులను గురించిన భారము లేని యవ్వనస్థులు ఎంత బలహీన స్తంభాలుగా దేవుని ఇంటిలో వున్నారో గమనించుట చాల దుఃఖమైన విషయము.

గనుక మత్తయి 6:20 భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనకుడి…పరలోకములో మీకొరకు ధనమును  కూర్చుకొనుడి అన్న మనప్రభువు ఆజ్ఞకు లోబడి, కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించుచు ఎల్లప్పుడూ ప్రభువు పరిచర్యలో నిమగ్నమయి మనము బలమైన స్తంభాలుగా ప్రభువు ఇంటిలో నుండునట్లు మనము తీర్మానించు కొనుటకు మన ప్రభువు మనకు సహాయమం చేయును గాక.

 

లోక సంభందమైన స్థానమును(జీవపుడంబము)  బట్టి మందిరములో దేవుని వాక్యమునకు చెవియొగ్గక, వాక్యమునకు విధేయత చూపక, తమను తాము సరిచేసికొనక గర్వముతో ప్రవర్తిస్తూ  వాక్యోపదేశకులను విమర్శిస్తూ, తామే నీతిమంతులమనుకొను యవ్వనస్థులు లోతు భార్య వలే నిష్ఫలులుగా ఉండుట మనము చూడగలము. ఈ జీవపుడంబమును బట్టి అనేకమంది యవ్వనస్థులు పాటలు  పాడేసమయములో  వాయిద్యములు వాయించి, వాక్యము ఉపదేశించబడే సమయంమంలో మందిరము బయట నిలబడి ఉండుట, టీ కొట్లలో పిచ్చాపాటి మాట్లాడుకొనుట, చేయుదురు. దీనివలన వాక్యము వారిలో లోతుగా నిలబడక బలవంతులుగా ఉండలేక పోవుచున్నారు. అపో కా 20:9 లోని యవ్వనస్థునివలె కిటికీ లో కూర్చొని అనగా రెండు వైపుల,  లోకము పోకడలు ఒకవైపు మరియు ఆత్మీయ కార్యక్రమాలలో పాల్గొనుట మరొకవైపు కలిగి ఉండుట వలన ఆత్మీయముగా ఘాడ నిద్రలోకి జారుకుని, నిద్రా భారము కలిగి ఆత్మీయ జీవితములో చనిపోయినవారుగా ఉంటున్నారు.

లోతు అయన భార్య, వారికి తీర్పరిగా సొదొమ గవిని యెద్ద గల  స్థానమును బట్టి దేవుని ఆజ్ఞకు లోబడక పోవడము మనము చూస్తాము. ఆది.కా. 19:12  ‘తీసికొని రమ్ము’! అని చెప్పినప్పటికీ వారు తడవు చేయుట దేవదూతలు చూసి వారిని చేతులు పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చిరి. దేవుడు ఆమె పేరును ఇవ్వలేదు ఎందుకంటే ఆమె అవిధేయత అంత భయంకరమైనది!  మనకు తెలుసుకోవడం నిజంగా ముఖ్యం కాదు. ఆయన మన హృదయాలను కోరుకుంటున్నారని మనం గుర్తుంచుకోవాలని ఆయన కోరుకుంటాడు. ఈ లోకం యొక్క ఆనందాల కోసం మనం ఎంతో ఆశగా ఉన్నప్పుడు, అవి  దేవునితో మనకున్న అద్భుతమైన సంబంధాన్ని పాడుచేస్తాయి. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా చేస్తాయి.

మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దేవుని కంటే గొప్పవారము కాము, దేవుని వాక్యము కంటే గొప్పవారము కాము. గనుక దేవుని వాక్యమును విన్న వెంటనే స్పందించి మనలను సరిచేసికొనుట ఎంతో అవసరము. దావీదు మహారాజు అంతటి వాడు “ఆ మనిషివి నీవే” అన్న వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. అందుకే జీవితాన్ని సరిచేసుకొని విజయవంతమైన జీవితాన్ని జీవించి  దేవుని హృదయానుసారుడు అనిపించు కున్నాడు. అక్కడ తన రాజరికాన్ని తాను చూపించుకోలేదు కానీ తాను పాపము   చేసిన వాడినని పాపినని ఒప్పుకున్నాడు. మనము లోకములో, ఉద్యోగములో, సమాజములో లేదా సంఘములో ఏ స్థాయిలో ఏ స్థానములో ఉన్నప్పటికీ జీవపుడంబము లేనివారమై దేవుని వాక్యమునకు ప్రథమ స్థానము ఇచ్చి ఎవరు వాక్యము చెప్పిన దానిని స్వీకరించగల దీన హృదయమును కలిగియుండవలెను. అప్పుడే దావీదువలె ఈ భూమిపైన దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చగల బలమైన స్తంభములుగా ఉండగలం.

దేవుడు సౌలు జీవితములో అద్భుతమైన కార్యముచేసి మొదటి రాజుగా ఏర్పరచుకున్నాడు అయితే పాపమూ చేసిన తర్వాత తన వద్దకు దేవుని ప్రవక్త ద్వారా హెచ్చరిక పంపబడినప్పుడు I సమూయేలు 15:30 ‘నేను పాపము చేసితిని అయితే  నా జనుల పెద్దల యెదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరచుటకు నాతో కూడా రమ్ము’ అని తన స్థానాన్ని బట్టి దేవునికి విధేయుడు కాక తన రాజరికాన్ని తన రాజ్యాన్ని పోగొట్టుకొని దాగోనుగుడిలో తన సుందరమైన తల వ్రేలాడదీయబడిన నిష్ఫలుడుగా తన జీవితాన్ని పాడుచేసికొన్నాడు.

 

ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎంతో ప్రేమించెను (యోహాను సువార్త 3:16). మనము బలహీనులమై శత్రువులమై పాపులమై యుండగా ఆయన మనలను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి మనకొరకు చనిపోయెను (రోమా 5:6-8) తన ప్రాణము కంటే మిన్నగా మనలను ప్రేమించాడు. నిర్హేతుకముగా ఎటువంటి అర్హత లేని మనలను ప్రేమించి రక్షించాడు. ఆయన ప్రేమకు బదులుగా ఏమి ఇవ్వగలం?

ఆయనను ప్రేమిస్తే నీకు అయన కొదువ చేయడని దేవుని వాక్యంలో అనేక విషయాలు వ్రాయబడ్డాయి

1) సామెతలు 8:21 నన్ను ప్రేమించు వారిని  ఆస్థి కర్తలుగా చేయుదును

2) వారినిధులను నింపుదును

3) కీర్తన 91:14 అతడు నన్ను ప్రేమించు చున్నాడు గనుక నేనతని తప్పించెదను,

4) ఘనపరచెదను,

5) ఉత్తరమిచ్చెదను,

6) తోడైఉండెదను,

7) గొప్పచేసెదను,

8) తృప్తిపరచెదను

9) ప్రత్యక్షపరచుకొందును మరియు

10) న్యాయాధిపతులు 5:31 అయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు…

 

మనము లోకమును లోకపు స్థలమును (శరీరాశ), లోకపు ఆస్తులను (నేత్రాశ)   లోకపు  స్థానమును, (జీవపుడంబము) ప్రేమించకుండా, దావీదు మహారాజు వలె యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించు చున్నాను! అని చెప్పగలిగి, చూపగలిగి మరియు చేయగలిగి ఉన్నప్పుడే అనేకమైన ఆత్మేయమైన భౌతికమైన  ఆశీర్వదములను పొంది మనము బలముతో ఉదయించు సూర్యునివలె, బలమైన స్తంభములుగా దేవునియింటిలో ఉండగలము. అట్టి కృపను దేవుడు మనకందరికీ దయచేయును గాక.

About the Author

- I am Saved by the amazing grace and marvelous mercy of my Lord and Savior, Almighty God JESUS CHRIST, washed by His Precious Blood and being prepared by His Word and His ministry of intersession to meet Him one day to stay with Him for ever and ever.